ప్రతి సంవత్సరం బాలల దినోత్సవం ఎంతో ఆర్భాటంగా,నవంబరు 14న ,చాచా నెహ్రు జయంతి సందర్భంగా, జరుపుకుంటున్న మన దేశంలో ,బాలలపై ఇంటా బయటా ,పాటశాలలో జరుపుతున్న శారీరక మానసిక హింస , ఇతర నేరాలు గమనిస్తే ,బాలల పండుగకు అర్థమే లేదని అనిపిస్తోంది నోరు లేని పసివారిపై 3 సంవత్సరాలు ,5,6 సంవత్సరాలు అని కుడా చూడకుండా ,జరుపుతున్న అత్యాచారాలు చూస్తుంటే , మృగాలకంటే హీనమైన మానదా మన మానవ జాతి అని అనిపిస్తుంద.
ప్రతి స్కూలులో బాలల దినోత్సవం ఒక పండుగగా చేస్తారు. కాని బయటకు చెప్పలేని మానసిక ,శారీరక హింసని అనుభవిస్తున్నారు బాలబాలికలు. ఆయా సంఘటనల గూర్చి విన్నప్పుడు ,మీడియా లో చూసినప్పుడు పాఠ్ శాలల్లో కూడా పిల్లలకు రక్షణ లేదుకదా అని ఎంతో బాధగా ఉంటోంది టీచర్ కీచకుడుగా మారడానికి గల కారణాలేమిటి?గురువు అంటే చీకటిని తొలగించేవాడు జ్ఞానబొధ చేసి దిశా నిర్దేశం చేయాలిగాని ,మానవీయ విలువలను మట్టిలో కలుపుతున్నారెందుకు ? అని అనిపిస్తుంది
దాదాపు 40 సంవత్సరాలు టీచర్ గాను ,కాలేజిలో ప్రొఫెసర్ గాను పనిచేసి అనుభవం గడించిన నేను ,ఈనాటి టీచర్లు స్కూళ్ళలో విద్యార్థులకు ,సరిఅయిన శిక్షణ నివ్వగలిగే సమయం వారికి దొరకడం లేదేమో అనుకోవలసి వస్తోంది పిల్లలు పెడదారులు పట్టకుండా, విద్యాబుద్ధులు చెప్పలేక పోవడానికి కారణాలు పరిశీలిస్తే, అనంతమైన పాట్యాఅంశాలు ,పని దినాలు తక్కువ కావడం ,సమయా భావంతో పాటు , సగం మంది టీచర్లుగా శిక్షణ పొందకపోవడం , వారు చదివింది ఒకటి, చెప్పేది మరి ఒకటి. వీటి అన్నిటితో పాటు ప్రభుత్వ కార్య కలాపాలలో , ఎన్నికలప్పుడు టీచర్ల చేత పని చేయించుతారు. పైగా ఉన్న 170/180 పని దినాలలో , సిలబస్ పూర్తి చేయాలనే చూస్తారు. ప్రభుత్వ పాట శాలల్లో ఒకొక్క తరగతిలో 70, 80 పైనే ఉన్న బాల బాలికలకు సరిఅయిన క్లాస్ రూం వసతులు, ఫర్నిచర్ ఏమి ఉండవు. దానితో పాటాలు చెప్పవలసిన గురువులకు , విద్యార్థులకు మధ్య సరి అయిన అవగాహన ఉండదు పిల్లలకు బుద్దులు చెప్పే సమయం ఉండదు. అందువలన పిల్లలను క్రమ శిక్షణ పేరుతో శారీరక మానసిక హింసకు గురి చేస్తారు పట్టణాలలో దూరా భారంతో ,టీచర్లు, విద్యార్థులు కూడా రవాణా సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇన్నిరకాలైన వత్తిడుల మధ్య టీచర్లు పిల్లల్ని అధికంగా శిక్షించడం , విచక్షణ కోల్పోయి హింసించడం ,ప్రిన్సిపాల్ గదికి పంపి దండింప చేయడం జరుగుతుంది.
ఇంక పిల్లల తల్లి తండ్రుల విషయానికి వస్తే వారు తమ ఉద్యోగాలు , పనులు, ఇంటి వ్యవహారాలు చక్క పెట్టుకోవడానికి ,పిల్లల్ని ఎంత త్వరగా స్కూలుకి పంపించేస్తే ,తమ బాధ్యత వదిలి పోతుందని భావిస్థారు. పేరెంట్స్ మీటింగులకి వెళ్ళడానికి, వాళ్లకి టైము లెదు.పిల్లలు అల్లరి చేస్తున్నారు ,సరిగ్గా చదవటం లేదని ,టీచర్లు స్కూలు డైరీ లో వ్రాస్తే , మీరే పిల్లల్ని కొట్టి, హింసించి అయినా దారిలో పెట్టమని చెప్తారు. చదువుకోని తల్లి తండ్రులైతే అసలే పట్టించుకోరు ,సరికదా స్కూలు మానిపించి పొలం పనులు , ఇంట్లో చిన్న పిల్లలను చూడటం లాంటివి చేయించుకుని చదువంటే నిర్లక్ష్యం చేసేలా చూస్తారు.
మరి బాల బాలికల గోడు వినేదెవరు?బాల్యం నుండే ఎంతో విచక్షణకు ,నిర్లక్ష్యానికి గురి అవుతున్న బాల బాలికలెందరో. రెండున్నర ఏళ్ళ పసివాళ్ళని ప్రిస్కూలు లో వేయడం ప్రారంభిస్తారు. ఊహ తెలియని చిన్నారి స్కూలులో నీళ్ళ సంపులో పది మరణించాడు. మూడేళ్ళ పసి కూనని బెంగలూరులో అత్యాచారం చేసాడు టీచర్ అనే నరరూప రాక్షసుడు. ఆడపిల్లల్ని సరిగ్గా చదవటం లేదని తిట్టి, మానసిక క్షోభ పెట్టి , వాళ్ళు ఏడిస్తే, లాలిస్తున్నట్లు చేస్తూ వళ్ళంత తడుముతూ వెకిలి చేష్టలు చేసే మగ టీచర్లు మరి కొందరు. ఇంట్లో పెనిమిటితో కయ్యమాడి వచ్చిన లేడీ టీచర్ ,క్లాసులోని 40మంది పిల్లల్ని గొడ్డును బాదినట్లు బాధించింది. అల్లరి చేసాడని ,పిల్లాడి బట్టలిప్పి , అందరికి కనపడేలా నిలబెట్టి హింసిస్తుంటే, ఎవరో మొబైల్ ఫిలిం తీసి మీడియాకి తెలిపారు. గుడ్డివారైన బాలల్ని, విచక్షణా రహితంగా ,తను అంధుడై ఉండి ప్రిన్సిపాలు హింసించిన ఘటన మరువలెము. ట్యూ టర్ని పెడితే మూడు సంవత్సరాల పసివాడిని బాదేసింది, ఓర్పులేని ఒక టీచర్. ఇలా చెప్పుకుంటూ పోతే, పిల్లల పైన జరుగుతున్న శారీరక,మానసిక హింసలకు అంతే లెదు.
తరగతి గదిలో టీచర్లు కేన్ తో కొట్టడం ,అరవడం ,ఎండలో నిలబెట్టడం, వేలకోలంగా ,హీన పరుస్తూ మాట్లాడడం , నీకు చదువే రాదనీ, వెనుక బెంచికి మార్చడం ఇవన్ని పిల్లల మంచికోసం చేస్తున్నామని చెప్పే కొందరు టీచర్లు అనబడే కిరాతకుల ప్రతికూల ధోరణి.ఇటువంటి పరిస్థితులలో బాలల మానసిక ధోరణి కూడా వికృత రూపం దాల్చి , వాళ్ళు స్కూలు మానేయడమో ,అల్లరి చిల్లరిగా తిరగడమో, అక్రమ రవాణాకి లోబడడం ,ఇంట్లోంచి పారిపోవడం, బాల కార్మికులుగా మారడం జరుగుతున్నది. ఇవేనా మనం భావి భారతావనికి ఇచ్చే బహుమానం?
రాజకీయాలకి, ఎన్నికలకి, సంక్షేమ పథకాలకి కోట్లాది రూపాయిలు ఖర్చు పెడుతున్న మన ప్రభుత్వాలు ,కార్పొరేట్ దిగ్గజాలు, స్వచ్చంద సంస్థలు, స్కూళ్లలోని తరగతి గదులు ,వ్వ్యాయామ శాలలు, టాయ్లెట్లు ,ఫర్నిచరు ,లైబ్రరీలు ఉన్నాయా లేవా అని గమనించరు. ఉన్న వారి పిల్లలకు ఒకరకమైన పాట శాలలు, లేనివారికి మరొక రకం . బాల్యంలోనే విచక్షణ వెళ్లునికుని పోయింది. ప్రతి మనిషికి బాల్యం ఒక వరం. చిన్న నాటి జ్ఞాప కాలే , అనుభవాలే , వారి భవిష్యత్తుని తీర్చి దిద్దుతాయి అన్నది పరమ సత్యమ్. .
నా చిన్న తనంలో 3వ తరగతి చదువుతున్నపుడు క్లాసులో క్రమ శిక్షణకు ,అందరి తలల పైన వరుసగా ఒకొక్క దెబ్బ వేస్తున్న టీచర్ , నన్ను అనవసరంగా కొట్టిందని ఏడిచి స్కూలు మానేశాను. నాల్గవ రోజున ఆ టీచర్ ,నేను ఎందుకు స్కూలుకు రావటంలేదని, మా ఇంటికి వచ్చి , స్కూలుకు దగ్గరుండి తీసుకు వెళ్ళింది. 60 సంవత్సరాల ఆ సంఘటన ఈనాటికి, నాకు తీపి జ్ఞాపకం.
నేను ఒక కాన్వెంట్ స్కూలులో టీచరుగా పని చేసినప్పుడు , నా క్లాసులో పిల్లలు ,ఫ్రీ గా ఉండి అల్లరి చేస్తున్నారు అని హెడ్ మిస్ట్రెస్ ,నన్ను మందలించడం, ఒక గుర్తుగా ఉండిపోయింది. అంతేకాదు ఒకటవ తేదీకల్లా నాలుగు క్లాసుల పరీక్ష పేపర్లు దిద్ది, మార్కులు ఇవ్వలేక పోయానని ,అవి ఇచ్చిన దాకా , జీతం ఇవ్వనని ఆమె చెప్పడం మరో జ్ఞాపకం. విశ్వ విద్యాలయం లోకూడా పేపర్ క్షుణంగా చూసి మార్కులు వేయడమే అలవాటైన నేను,అందరికన్నా ఆలస్యంగా ఇంటికి వెళ్ళేదాన్ని.
కాలేజిలో పని చేస్తున్నపుడు నా విద్యార్ధి ,నా వ్యక్తిత్వాన్ని, ఒక అమ్మగా వర్ణించి రాసినపుడు , యువకులైన విద్యార్థులు నాయందు చూపిన గౌరవమ్, అభి మానం , నేను మరువలేను. అంధులైన విద్యార్థులు ,నేను పాట్య అంశాలు ,క్యాసేట్లుగా రికార్డు చేసి ఇస్తే,హాస్టల్కి పట్టుకుని వెళ్లి విని, పరీక్ష లు వ్రాసేవారు . ఆడపిల్లల కాలేజిలో ,విద్యార్థినులు , ఇప్పటికి , నేను రి టయిరయ్యి పది సంవత్సరాలైనా , నాకు ఫోను చేసి , వచ్చి కలసి ,సలహాలు అడిగి ,ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినా ,వాళ్ళు ,నన్ను ఆప్యాయతతో పలకరించడం ,నాకు పులకరింపు కలగా చేస్తుంది. ఇప్పటికి నా నమ్మకం మంచి టీచర్లు ఉన్నారు . మరింత మంచి విద్యార్థులు ఉన్నారు. వారే ఈ భారతావనిని తీర్చి దిద్దే భావి భారత పౌరులు .
గురు శిష్య సంబంధం వెల కట్ట లేనిది.మానవీయ విలువలకు పరాకాష్ట . దానిని బద్రంగా పరిరక్షించు కోడమే మనం జరిపే బాలల దినో త్సవ పండుగకి సార్ధకత.
No comments:
Post a Comment